
Pasula Pakalo Pasidi Deepamai || Telugu Christmas Song

Pasula Pakalo Pasidi Deepamai || Telugu Christmas Song
పశుల పాకలో పసిడి దీపమై
పిడికిళ్లు తెరిచింది నవశకం
పులకించి పలికింది పుడమి స్వాగతం
¶పశుల పాకలో¶
1. జగమేలు రారాజు రాక – జన జీవితాల వెలుగు రేఖ (1)
తెలిపింది ఆకాశవాణి – ఇతడేసు మాదైవ సుతుడని (1)
పరిపూర్ణ తేజం – సాధించు ధ్యేయం
అవిరామ కృషితో – సాగించు ధ్యానం
ఎదిరించే సాతాను పరీక్ష – శిరసొంచు నా ప్రభుని దీక్ష(1)
భుక్తిని వేటాడు శ్రమలు ఇక మానండి
ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి (2)
ఓ పేతురు..ఓ యోహాను..ఓ యకోబులార..
నా అడుగుల జాడబట్టి నడువగ రారా (1)
శోకపు కడలిని సాగి – దీనుల జీవన నావకు
త్రోవను చూపెడు తోడుగా అవతరించెను
ఉరికిన ఉప్పెన సైతం – ఆతని చూపుల ఆనకు
ఆగిన మహిమను చూసిన – భువి తరించెను (1)
వేడిన అంధుని మొరవిని – దృష్టిని దానము చేసిన
సుందర రూపుని గాంచినదే పుణ్యము
మూగకు మాటలు నేర్పిన – పావన నామము నిత్యము
గానము చేసిన జన్మకు సాఫల్యము (1)
వేధించే వ్యాధికి ఔషధమై – మృత్యువునే గెలిచిన అమృతమై
ఆప్తులకై శాశ్వత శాంతి పథం
ఓహోహో వెలసెను పరమపథం పరమపథం పరమపథం
పరమపథం పరమపథం
కరుణామయుని కాంతి కిరణాల తాకిడికి కరిగింది అజ్ఞాన తిమిరం
కలుషాత్ములకు కలిగే మితిలేని మధమాత్సర్యములతో అసహనం
పథకాలు వేసింది పాపం – పతనానికది ప్రథమ పాదం
ముసిరింది దుర్మార్గ ధూమం – మసిబారే మానవుని జ్ఞానం
ఓ…………………..
రుధిర ధారతో అధము చూపుతో
పయనించే అభిషక్తుడు కరుణ జ్యోతిగా
వెలిగించే తన బ్రతుకును కర్పూరముగా (1)
మరణానికెదురరేగు చరణం
పాపాల నిశి చీల్చు కిరణం
ఆరాధ్యమైన సిలువ రూపం
అపురూపమైన త్యాగ చిహ్నం
నరజాతి కోసం బలి అయిన ప్రాణం
ధరలోన నిలిచే అరుదైన దానం
కబలించ కలిగేన కాలం
కరుణామయుని కీర్తి కాయం
హల్లెలూయ…హల్లెలూయ…హల్లెలూయ….
పరలోకమందున్న మా తండ్రి
నీ నామం పరిశుద్ధ పరచబడుగాక
నీ రాజ్యం మాకు వచ్చుగాక
నీ చిత్తం పరలోకమందు నేరవేరునట్లు
భూలోకమందు నేరవేరు గాక
మాకు కావలసిన అనుదిన ఆహారం
నేడు మాకు దయచేయుము
మా ఋణస్తులను మేము క్షమించినట్లు
మా ఋణములను క్షమింపుము
మమ్ములను శోధనలో పడనియ్యక
కీడు నుండి తప్పింపుము
ఎందుచేతననగా ?
రాజ్యము బలము మహిమ
నిరంతరం నీవై యున్నావు
ఆమేన్.. ఆమేన్.. ఆమేన్…